విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ chinni (చిన్ని) ఆయన సతీమణికి ఈడీ (ED) నోటీసులు వచ్చాయంటూ గత కొన్ని గంటలుగా సోషల్ మీడియా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంపై ఎంపీ తీవ్రంగా స్పందించారు. విజయవాడ గురునానక్ కాలనీలోని తన కార్యాలయంలో అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించి ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు నిజాలను బయటపెట్టారు. తన భార్యకు ఈడీ నోటీసులు ఇచ్చిందనే వార్తల్లో ఎలంటి నిజం లేదని పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.
నోటీసులు వచ్చింది ఆమెకు కాదు..
మద్యం స్కామ్‌లో తన భార్యకు ఈడీ నోటీసులు ఇచ్చిందంటూ వైసిపి చేస్తున్న ఆరోపణలను ఎంపీ chinni మీడియా ముఖంగా అవాస్తవమని ఖండించారు.
కంపెనీకే నోటీసులు: గతంలో పెట్టిన ‘కేశినేని డెవలపర్స్’ కంపెనీలో తన భార్య కేవలం ఒక డైరెక్టర్‌గా మాత్రమే ఉన్నారని.. ఈడీ నోటీసులు పంపింది కేవలం సదరు కంపెనీకి మాత్రమేనని, తన భార్యకు ఎలాంటి వ్యక్తిగత నోటీసులు రాలేదని ఆయన స్పష్టం చేశారు.
కోర్టుకు కంపెనీ ప్రతినిధులు: ఈ నెల 27న కంపెనీ ప్రతినిధులు విచారణ అధికారుల ఎదుట హాజరై పూర్తి వివరణ ఇస్తారని ఆయన వెల్లడించారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివరాలు కోరుతూనే ఈడీ ఈ సాధారణ నోటీసులు పంపిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

కేవలం 35 లక్షల లావాదేవీ.. అది కూడా ఆర్కిటెక్ట్ ఫీజు!
ఈ వివాదం వెనుక ఉన్న వ్యాపార భాగస్వామ్యం గురించి కూడా ఎంపీ చిన్ని ఓపెన్‌గా ప్రెస్మీట్లో మాట్లాడారు.
- 2022లోనే ఎగ్జిట్: రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘ఇశ్వాని’ సంస్థతో కలిసి తాము గతంలో ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేశామని.. అయితే రాజ్ కేసిరెడ్డి వ్యవహారాల సంగతి తెలిసిన వెంటనే 2022లోనే తాము ఆ సంస్థ నుండి పూర్తిగా బయటకు రావడం జరిగిందని ఆయన తెలిపారు.
- ఆర్కిటెక్ట్ ఫీజు మాత్రమే: ఆ సంస్థ ద్వారా కేవలం 35 లక్షల రూపాయల లావాదేవీలు మాత్రమే జరిగాయని.. అది కూడా కేవలం ఆర్కిటెక్ట్ ఫీజు మాత్రమేనని అంతకుమించి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదనే విషయాన్ని ఈడీకి ఇచ్చే వివరణలో పక్కా ఆధారాలతో నిరూపిస్తామని ఎంపి చెప్పారు.
వైసిపి చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు తాము దీటుగా స్పందిస్తున్నందుకే.. తట్టుకోలేక తనపై, తన కుటుంబంపై ఇలాంటి బురదజల్లే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం ఒక గృహిణిపై ఇలాంటి నిందలు వేయడం సరికాదని ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని ఘాటుగా సమాధానమిచ్చారు.