విజయవాడ / కంచికచర్ల: కంచికచర్ల పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) బలపరిచిన కంచికచర్ల సర్పంచ్ అభ్యర్థిగా అల్లాడి కోటేశ్వరరావు పేరును ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరిన అల్లాడి కోటేశ్వరరావుకు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దశాబ్దాల కాలంగా టీడీపీకి అంకితభావంతో సేవలందించిన అల్లాడి కోటేశ్వరరావు కుటుంబాన్ని ఆ పార్టీ అవమానించిన తీరును కంచికచర్ల ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో బీసీ వర్గాలకు ఎప్పటికీ సముచిత స్థానం లభించదని, కష్టపడే నాయకులకు అక్కడ గుర్తింపు ఉండదని ఆయన ఆరోపించారు.
టీడీపీలో డబ్బు సంచులకే ప్రాధాన్యం: అల్లాడి కోటేశ్వరరావు
వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం అల్లాడి కోటేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ నాయకత్వంపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. కంచికచర్ల ప్రజలకు సేవ చేయాలనే తన ఆలోచనకు అండగా నిలిచిన వైసీపీ అధిష్టానానికి, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
• కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచా: 2019లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కంచికచర్లలో ఓసీ జనరల్ ఎంపీటీసీ స్థానానికి పోటీ చేయడానికి టీడీపీ తరఫున ఎవరూ ముందుకు రాకపోతే, తాను ధైర్యంగా ముందుకొచ్చి పోటీ చేశానని గుర్తుచేశారు. ఆనాడు ఓసీ జనరల్ స్థానంలో బీసీ అయిన తాను పార్టీకి పనికొచ్చానని, ఇప్పుడు కంచికచర్ల పంచాయతీ బీసీకి రిజర్వ్ అయితే తాను ఎందుకు పనికిరాకుండా పోయానని ప్రశ్నించారు.
• డబ్బు సంచులకే పెద్దపీట: నందిగామ నియోజకవర్గంలో టీడీపీ కష్టపడ్డ కార్యకర్తలకు కాకుండా డబ్బు సంచులకే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. తనకంటే గొప్ప, సమర్థుడైన అభ్యర్థిని ప్రకటించి ఉంటే తాను గర్వంగా జెండా పట్టుకుని పనిచేసేవాడినని, కానీ కేవలం డబ్బు కోసమే వేరే అభ్యర్థిని ఎంపిక చేశారని విమర్శించారు.
• స్వార్థ రాజకీయాలకు బలి: మండల పరిధిలోని ఒక వ్యక్తి తన పెత్తనం, స్వలాభం కోసం కష్టపడే నాయకులకు అన్యాయం చేస్తూ, డబ్బు ఉన్నవారికే సర్పంచ్, ఎంపీపీ పదవులను కట్టబెడుతున్నారని మండిపడ్డారు.
ఈ మీడియా సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు వేమా సురేష్ బాబు, ఎంపీటీసీ సభ్యుడు యోహాను, పార్టీ నాయకులు మాడుగుల మధు, మంగళపూడి కోటి, సన్నీ తదితరులు పాల్గొన్నారు.


