
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి సామాన్య ప్రజలపై భారం తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ ధరలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
రేషన్ షాపుల్లో అందుబాటులోకి రానున్న సరుకులు, ధరలు
డిసెంబర్ 1 నుంచి రేషన్ కార్డుదారులకు బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకే నాణ్యమైన నిత్యావసర వస్తువులను అందించనున్నారు.
- కందిపప్పు: కిలో రూ.100
- గోధుమ పిండి: కిలో రూ.25
- పామాయిల్: లీటర్ రూ.125
రైతు బజార్లలో ఉల్లిపాయల విక్రయం.. సీఎం కీలక ఆదేశాలు
మరోవైపు బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరల పెరుగుదలను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను కేవలం రూ.35కే విక్రయిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు కేవలం తాత్కాలిక చర్యలే కాకుండా, రాబోయే ఏడాది కాలానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.


